
ఆపరేషన్ సింధూర్ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. భారత సైన్యం కోసం జనం రోడ్డెక్కుతున్నారు. జాతీయ జెండాలతో ర్యాలీలు తీస్తున్నారు. పాకిస్తాన్ ను ఖతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ ప్రభుత్వం ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖ నేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
పాక్, భారత్ ఉద్రిక్తతల మధ్య సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా కీలక ఆదేశాలు జారీచేశారు. ఆపరేషన్ సిందూర్‌లో రాజకీయాలకు తావు లేదన్నారు. అత్యవసర సర్వీస్‌లకు సెలవులు రద్దు చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల వారు అక్రమంగా ఇక్కడ నివసిస్తుంటే వెంటనే వారిని అరెస్టు చేయాలన్నారు.ఉద్యోగులు, మంత్రులందరూ అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర మెడిసిన్, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.