
తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పందేరానికి ముహుర్తం ఫిక్సైంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో చర్చించిన హైకమాండ్.. ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేసింది. రేవంత్ కేబినెట్ లో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. పీసీసీ కార్యవర్గం ప్రకటించాల్సి ఉంది. అయితే పీసీసీ కార్యవర్గానికి ఓకే చెప్పిన అధిష్టానం.. మంత్రివర్గ విస్తరణపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది.
మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతలకు మరోరకంగా కూల్ చేసే యోచనలో హైకమాండ్ ఉందని సమాచారం. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్ ఇచ్చిందని గాంధీభవన్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మంత్రి పదవి కాకుండా మరో పదవి తీసుకొమ్మని పార్టీ పెద్దలు రాజ్‌గోపాల్‌ను కోరాని టాక్. మంత్రి పదవుల భర్తీకి మరో మూడు, నాలుగు నెలలు సమయం పట్టే చాన్స్ ఉంది. కాబట్టి.. పార్టీ చీఫ్ విప్ పదవి తీసుకోవాలని ఆఫర్ చేసినట్టు సమాచారం. తెలంగాణలో మూడు విప్ పదవులు భర్తీ చేసినా.. చీఫ్ విప్ పదవిని మాత్రం ఎవ్వరికి కేటాయించలేదు.
ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. వాళ్లు ఇద్దరూ కూడా రెడ్లే. దీంతో రాజగోపాల్ రెడ్డి మంత్రిపదవి ఇవ్వడం సాధ్యం కాదని హైకమాండ్ భావిస్తుందట.అందుకే రాజ్‌గోపాల్‌కు కేబినెట్ ర్యాంకు పోస్టులను ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ చీఫ్ విప్ పదవిని స్వీకరించేందుకు రాజ్‌గోపాల్ రెడ్డి సిద్దంగా లేరని తెలుస్తోంది. ఈ పోస్టు ఆఫర్ చేసిన నేతలపై రాజ్‌గోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. గతంలో పార్టీ మారే సమయంలో తనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పార్టీ పెద్దలను కోరారట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్‌గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చిందట. కానీ ఇచ్చిన హామీ ఏడాదైనా నెరవేరకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట. అందుకే ఎంపీ ఎన్నికల తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్లీ తన నోటికి పని చెబుతున్నారట.
మరోవైపు చీఫ్ విప్ పదవి వద్దన్న రాజగోపాల్ రెడ్డికి మరో పదవి కూడా ఆఫర్ చేసిందట హైకమాండ్. పీసీసీ కార్యవర్గం కూర్పులో భాగంగా నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని భావిస్తున్నారట. రెడ్డి, బీసీ, మైనార్టీ, ఎస్టీల నుంచి ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వాలని ప్లాన్. దీంతో రెడ్డి కోటాలో రాజగోపాల్ రెడ్డికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తుందట కాంగ్రెస్ హైకమాండ్. అయితే ఇందుకు కూడా రాజగోపాల్ రెడ్డి ఆసక్తిగా లేరని తెలుస్తోంది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తే తనకెందుని ప్రశ్నిస్తున్నారట. ఇస్తే ఒక్కరికే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని.. అలా అయితే తనకు ఓకే అని చెప్పారట. హైకమాండ్ మాత్రం కనీసం ముగ్గురికైనా ఇవ్వాలనే ఆలోచనలో ఉందట.