జాతీయంతెలంగాణ

ఢిల్లీలో ధర్నా చేయబోతున్న సీఎం రేవంత్ రెడ్డి!

బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం మార్చి పదో తేదీన చలో ఢిల్లీకి పిలుపునివ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి దీక్ష చేయాలని భావిస్తున్నారు. ఆ దీక్షా వేదిక నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షకు ఆహ్వానిస్తూ అన్ని పార్టీల అధ్యక్షులకు సీఎం రేవంత్ స్వయంగా లేఖలు రాయనున్నట్టు తెలిసింది. విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు అందరూ దీక్షకు హాజరైతే.. కేంద్రంపై ఒత్తిడి పెరిగి, బీసీలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంలో ఆయన ఉన్నారు. ఢిల్లీ దీక్షకు ఏయే రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.

కానీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ కేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు వెళ్లే చాన్స్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆలోచన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారనుంది. ఒకవేళ ఢిల్లీ దీక్షకు వెళ్తే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని బీజేపీ నుంచి విమర్శలు, వెళ్లకపోతే బీసీ వ్యతిరేకి అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మార్చి పదో తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజున సభలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు అంశాలను ప్రస్తావించనున్నారు. దేశంలో జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, అందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేయడమే ఎజెండా‌గా పెట్టుకున్నారని రాష్ట్రానికి చెందిన కీలక నేతలు చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రీ సర్వే ఈ నెల 28న ముగియనుంది. వెంటనే వర్గాల వారీగా జనాభా వివరాలను ప్రకటించి, కేబినెట్ ఆమోదించనుంది. ఆ సర్వేకు చట్టబద్దత కల్పించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, చట్టం చేయనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నారు. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణపైనా చట్టం చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మార్చి పదో తేదీ లోపు పూర్తి అవుతుందని, ఈ లోపు రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ సైతం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button