
CM Revanth Reddy: దేశ అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్రం ప్రతి రాష్ట్రంతో సమన్వయం కలిగి పనిచేయడం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్స్ రీజినల్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత బలపర్చేందుకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ ప్రయాణంలో తెలంగాణ కూడా కీలక పాత్ర పోషిస్తుందనీ, రాష్ట్రం పంపిన అభివృద్ధి ప్రణాళికలను కేంద్రం వేగంగా ఆమోదిస్తే దేశ ప్రగతికి అది భారీ ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు.
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణతో పాటు పలు రాష్ట్రాల మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా దేశ ఆర్థిక వృద్ధిలో ప్రముఖ స్థానం సంపాదిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థకు సహజంగానే మరింత బలం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రం రూపొందించిన పలు నగరాభివృద్ధి ప్రాజెక్టులు ఇప్పటికే కేంద్రానికి పంపించామని, వాటికి త్వరితగతిన అనుమతులు లభిస్తే భారీగా ఉపయోగమని అభిప్రాయపడ్డారు.
డిసెంబర్ 9న విడుదలకానున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశంగా నిలిచింది. ఈ దస్తావేజులో తెలంగాణ భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలు, పట్టణ విస్తరణ ప్రణాళికలు, పరిశ్రమల ఏర్పాటు, రవాణా సదుపాయాల అభివృద్ధి వంటి పలు కీలక అంశాలను ప్రభుత్వం సమగ్రంగా ప్రతిపాదించబోతోందని సీఎం తెలిపారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. 2047లో దేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో తెలంగాణ కనీసం 10 శాతం వాటా ఉండేలా కృషి చేస్తామని చెప్పారు.
మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది అభివృద్ధి, రీజినల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాల తరలింపు వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్, కాలుష్యం వంటి పెరుగుతున్న నగర సమస్యలను పరిష్కరించేందుకు కూడా కేంద్రం చేయూత ఎంతో కీలకమని అన్నారు.
అంతేకాకుండా, 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్ వంటి మహానగరాల స్థాయిలో పోటీ పడేలా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేసి అంతర్జాతీయ వాణిజ్యాన్ని వేగవంతం చేయాలనే దిశగా ప్రణాళికలు కొనసాగుతున్నాయని చెప్పారు. తమ పోటీ పక్క రాష్ట్రాలతో కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక నగరాలతోనే పోటీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే స్పష్టమైన దృష్టి తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. తెలంగాణకు ఇరుగు పొరుగు రాష్ట్రాలు అన్నీ స్నేహపూర్వకంగా ఉన్నాయని, వాటితో కలిసి పనిచేయడమే తమ లక్ష్యం అని చెప్పారు.
ALSO READ: Golden News: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఇంకెందుకు ఆలస్యం కొనేయండి..





