CM Revanth Reddy: 2029లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ విజయం సాధించాలని, అక్కడ గెలిచి ఎమ్మెల్యేను మంత్రిగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ సిద్దిపేట జిల్లా నర్మెట్‌లో నిర్వహించిన రైతు ఉత్సవాల సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగిందని, ఆ రెండు సార్లు ప్రజలు బీఆర్ఎస్‌కు అధికారం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే 2023లో కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, 2029లో కూడా మళ్లీ తమకే అధికారం ఇవ్వబోతున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సిద్దిపేటను 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం పాలిస్తోందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి, ఒక్కసారి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. మార్పు చేసి చూస్తే మంచి జరుగుతుందా లేదా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. మల్లన్నసాగర్, ఏటిగడ్డకిష్టాపూర్ వంటి ప్రాజెక్టుల విషయంలో గతంలో తమ ప్రభుత్వం ఎలా నిలబడ్డదో గుర్తు చేసిన ఆయన.. ఆ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును తాము అనుసరించడం లేదని స్పష్టం చేశారు. నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు నిర్వాసితులను ఒప్పించాకే పనులు ప్రారంభించామని తెలిపారు.
మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ప్రజల అభివృద్ధి ఆగిపోవాలనే విధంగా మాట్లాడటం సరికాదని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటామని చెప్పడం ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజల మేలు కోసం మాట్లాడాలని, కానీ అభివృద్ధిని ఆపాలనే ఆలోచనను ప్రజలు అంగీకరించరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా తాను సిద్దిపేటకు రాలేదా అని ప్రశ్నించిన ఆయన, 2029లో మళ్లీ గెలిచి సిద్దిపేటకు వస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో తనకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వారి నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తమ నిజాయితీని ప్రజల ముందే నిరూపించుకుంటున్నామని ఆయన అన్నారు. నర్మెట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు తాను ముఖ్యమంత్రిగా అయ్యాకే ప్రారంభమయ్యాయని చెప్పారు. కావాలనుకుంటే ఈ ఫ్యాక్టరీని తన నియోజకవర్గమైన కొడంగల్‌కు తీసుకువెళ్లేవాడినని, కానీ ఇక్కడి రైతుల ప్రయోజనాల కోసం ఇక్కడే నిర్మించామని తెలిపారు.
తనపై వివక్ష ఆరోపణలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2023 వరకు సిద్దిపేట నియోజకవర్గానికి ఎంత నిధులు వచ్చాయో, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత నిధులు ఇచ్చామో లెక్కలు తీయాలని ఆయన సవాలు విసిరారు. వివక్ష తమ ఇంటి మాట కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులను చూసి చూసి ప్రజలు ఓటు వేయాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. పేదల కోసం మాత్రమే పని చేస్తామని, రాజకీయ నాయకుల కోసం కాదని ఆయన అన్నారు. వ్యవసాయం తనకు తెలుసని, పంటలకు చీడపురుగులు వచ్చినప్పుడు ఏ మందు వేయాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
ALSO READ: IRCTC కొత్త టూర్ ప్యాకేజీ.. ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు
