తెలంగాణ

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేనట్టే! రేవంత్ దిమ్మతిరిగే షాక్

కాంగ్రెస్ సీనియర్ నేత, తనకు కొరకరాని కొయ్యగా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. మంత్రిపదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డికి ఝలక్ ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన మహ్మద్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మంత్రిపదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుకు కీలకమైన సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మెన్ బాధ్యతలు అప్పగించారు.

సీఎం రేవంత్ తాజా నిర్ణయాలు రాజగోపాల్ రెడ్డి మంత్రిపదవి ఆశలపై గండి కొట్టాయి. తెలంగాణలో సీఎం కాకుండా 17 మందిమంత్రులకు అవకాశం ఉంది. గతంలో 14 మందిని భర్తీ చేశారు. మూడు ఖాళీగా ఉండగా.. మైనార్టీ కోటాలో అజారుద్దీన్ ను తీసుకున్నారు. మరో రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి రెడ్డికి.. మరొకటి బీసీ లేదా ఎస్టీకి ఇస్తారనే ప్రచారం సాగింది. రెడ్డి కోటాలో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి.. బీసీ కోటాలో మున్నూరు కాపు నుంచి ఆది శ్రీనివాస్, యాదవ సామాజికవర్గం నుంచి బీర్ల ఐలయ్య.. ఎస్టీ కోటాలో లంబాడ వర్గానికి చెందిన బాలునాయర్ పేర్లు వినిపించాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఛాయిస్ మాత్రం రెడ్డి కోటాలో సుదర్శన్ రెడ్డికేననే చర్చ సాగింది.

తాజాగా సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు ఆయనకు కేబినెట్ హోదాతో స్పెషల్ పవర్స్ ఇచ్చారు. గతంలో చాలా మందిని కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. మాజీ ఎంపీ కేశవరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, షబ్బీర్ అలీ, జితేందర్ రెడ్డి వంటి వాళ్లు ఉన్నారు. అయితే వాళ్లకు ఎవరికి లేకుండా సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదాతో పాటు మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేలా స్పెషల్ పవర్స్ ఇస్తూ జీవో ఇచ్చారు. అంటే మంత్రి కాకున్నా.. మంత్రితో సమానం అన్నమాట. ప్రణాళిక సంఘం చైర్మెన్ గా ఉన్న చిన్నారెడ్డికి కూడా కేబినెట్ హోదాతో పాటు కేబినెట్ సమావేశానికి హాజరయ్యే పవర్స్ కల్పించారు. ఈ లెక్కల ఖాళీగా ఉన్న రెండు మంత్రుల స్థానాలను చిన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డి భర్తీ చేశారనే టాక్ వస్తోంది.

కేబినెట్ కూర్పుకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం ఉన్న నిబంధనల ప్రకారం ఇంకా భర్తీ చేసే ఛాన్స్ లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని చెబుతున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినైనా తీసివేస్తేనే.. ఆ ప్లేస్ లో కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డిని ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటే.. అన్న వెంకట్ రెడ్డిని తప్పిస్తే మాత్రమే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరికి మాత్రమే కేబినెట్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button