
పోలవరం కాంట్రాక్టర్ల తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌లిస్టులో పెడతానంటూ హెచ్చరించారు. అలా ఎందుకు చేశారు..? ఇంతకీ ఏం జరిగింది..? పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2027లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు.
గురువారం (మార్చి 27న) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు చంద్రబాబు. ప్రాజెక్టు పనులను చూసిన తర్వాత… సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ హాజరయ్యారు. కానీ.. ఎడమ కాలువ పనులకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ మాత్రం హాజరుకాలేదు. దీంతో.. సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. కాంట్రాక్టర్లు అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన గడువులోగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తిచేయకపోతే… కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు కూడా ఆలోచించేది లేదని తెగేసి చెప్పేశారు. ఎడమ కాలువ దగ్గర పనులు వేగంగా జరగకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read : వైనాట్ పులివెందుల – జగన్ అడ్డాలో టీడీపీ పాగా..!
2025 డిసెంబర్‌లోగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 2027 ఏప్రిల్ నాటికి ప్రాజెక్ట్ పూర్తికావాల్సిందే అని స్పష్టం చేశారు. పాపికొండల వరకు ఉన్న కొండలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి… పర్యాటకులకు సౌకర్యంగా ఉండేలా ఏం చేయాలన్నది ఆలోచించాలని కలెక్టర్లతో చెప్పారు.