డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనాను మించిన కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త వైరస్ బారినపడి లక్షల సంఖ్య చైనా ప్రజలు ఆస్పత్రుల్లో చేరుతున్ారు. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చైనావ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ వైరస్ సోకినవారిలో కొవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా ప్రత్యేక రిసెర్చ్ సెంటర్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
దాదాపు ఐదేళ్ల క్రితం కొవిడ్-19 వ్యాప్తిపై సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. గత రెండ్రోజుల్లో 300 మంది ఈ వైరస్‌కు బలయ్యారు. పరిస్థితి దిగజారిపోవడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది.
జపాన్‌లో కూడా ఈ వైరల్ వ్యాపించింది. జపాన్ దేశ వ్యాప్తంగా 7 లక్షల 18 వేల కేసులు నమోదయ్యాయని.. 2024 డిసెంబర్ నెలలోనే 94 వేల 259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశ వ్యాప్తంగా 5 వేల ఆస్పత్రులు, క్లినిక్స్ లో HMPV వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది జపాన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్. వైరస్ బాధితుల్లో అన్ని వయస్సుల వారు ఉన్నారని.. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది.
ప్రధానంగా హెచ్‌ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందంటే…. దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు.వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్ సోకుతుంది.
ఈ వైరస్ తో పిల్లలు,ముసలివారికి, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్‌ఎంపీవీ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జబ్బుపడన వారు తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.మరి ముఖ్యంగా దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వొద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే హెచ్‌ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు.