India-Pakistan Conflict: భారత్-పాకిస్థాన్ మధ్య మే 2025నెలలో జరిగిన సైనిక ఘర్షణను తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పదులసార్లు ప్రకటించగా.. ఇప్పుడు ఈ వ్యవహారంలో చైనా తలదూర్చింది. మే 7 నుంచి 10 వరకు జరిగిన ఘర్షణ తమ మధ్యవర్తిత్వం వల్లే ఆగిందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ ప్రకటించారు. బీజింగ్‌లో అంతర్జాతీయ పరిస్థితులు, చైనా విదేశీ సంబంధాలు అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసియా ఖండంలో అనేక సైనిక ఘర్షణలను చైనా తన దౌత్యం ద్వారా ఆపిందని చె ప్పుకొచ్చారు.
ఇంతకీ వాంగ్ ఏమన్నారంటే?
రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఏడాది (2025) దేశాల మధ్య సైనిక ఘర్షణలు, సరిహద్దు వివాదాలు చెలరేగాయని వాంగ్ వెల్లడించారు. వీటిని నివారించి, శాంతిని నెలకొల్పేందుకు మేము న్యాయమైన, సానుకూల విధానాలను అనుసరించామన్నారు. ఉత్తర మయన్మార్ లో ఘర్షణతోపాటు ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమ వివాదం, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, పాలస్తీనా- ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపామన్నారు. ఇటీవల థాయ్‌లాండ్, కాంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణను కూడా తామే ఆపినట్లు చెప్పుకొచ్చారు.
చైనా ప్రకటనను ఖండించిన భారత్
చైనా ప్రకటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పోరాటం చేసింది నిజానికి పాకిస్థాన్‌తో కాదని చైనాతో అని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు. చైనా ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. జాతీయ భద్రత పెద్ద జోక్‌గా మారిందని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. ఈ అంశంపై ప్రధాని ఇప్పటికైనా మౌనం వీడాలని డిమాండ్ చేశారు.





