అంతర్జాతీయం

ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ సమావేశం!

Modi-Wang Yi Meet: భారత్-చైనా సంబంధాలు బలోపేతం కాబోతున్నాయి. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.  పీఎం అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్‌ లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోడీ ఆయనకు సాగర స్వాగతం పలికారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.  2020లో గాల్వాన్  ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు బలహీనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఈ సమావేశం కీలక ముందడుగు కాబోతోంది.

సరిహద్దుపైనే కీలక చర్చలు

వాంగ్ యి భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు సమసిపోయే అవకాశం ఉంది. సైనిక, దౌత్యపరమైన చర్చలు జరగనున్నాయి. 2020 నుంచి రెండు వైపులా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వీటి నివారణకు చర్చలు జరపనున్నారు. శాంతిని కాపాడడం సహా సరిహద్దు సమస్యలను పరిష్కరించడం వంటి పలు అంశాల గురించి ప్రధాని, వాంగ్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు, చైనాలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం గురించి కూడా చర్చించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భారత్, చైనా, రష్యా వంటి దిగ్గజ దేశాలు ఉన్నాయి. ఇది భద్రత, వాణిజ్యం, సహకారం గురించి చర్చించుకునే వేదిక. మోడీ, వాంగ్ యి ఈ సమ్మిట్ కోసం ఎజెండాను నిర్ణయించనున్నారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, ఇటీవలి ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా చర్చించారు.

ఆసియా సహా ప్రపంచ రాజకీయాలపై ప్రభావం

భారత్, చైనా కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు. ఈ రెండు దేశాల సంబంధాలు ఆసియా సహా ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయి. వాణిజ్యం నుంచి భద్రత వరకు, ఈ రెండు దేశాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయనే దానిపై మరికొన్ని దేశాల నిర్ణయాలు కూడా మారతాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు దగ్గర కావడం భారత్, చైనాతో పాటు ప్రపంచానికి ఎంతో మేలు కలగనుంది.

Back to top button