ఒకప్పుడు గ్రామాల్లో అపరిచితులు అడుగుపెడితే కుక్కల అరుపులతోనే సమాచారం తెలిసిపోయేది. కానీ కాలం మారింది, వ్యవసాయం కూడా కొత్త దిశలో పయనిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల రైతులు ఇప్పుడు తమ మిర్చి పంటను కాపాడుకునేందుకు సాంకేతికతను ఆశ్రయించి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని మిర్చి తోటల్లో అడుగుపెడితే ఇక అరుపులు కాదు, కుయ్ కుయ్ మంటూ వినిపించే హైటెక్ సైరన్లు వినిపించడం కొత్త దృశ్యంగా మారింది. ఈ మార్పు ప్రస్తుతం ప్రాంతీయంగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని లంక భూముల్లో పండే మిర్చికి దేశీయ మార్కెట్లతో పాటు ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఇక్కడి నేల స్వభావం కారణంగా పండే మిర్చి అత్యంత నాణ్యమైనదిగా, ఘాటుగా ఉండటంతో రైతులకు మంచి ఆదాయం అందిస్తుంది. ఒక క్వింటా మిర్చి ధర వేలల్లో ఉండటంతో దీనిని ఎర్ర బంగారంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పంటను పండించడానికి రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, నెలల తరబడి కష్టపడుతున్నారు. కోత పూర్తయ్యాక కల్లాల్లో ఆరబెట్టే సమయంలో దొంగల బెడద తీవ్రమవుతోంది. దీంతో రైతులు రాత్రింబవళ్లు కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే క్రమంలో రైతులు సాంకేతికతను ఆయుధంగా మలుచుకున్నారు. గోదావరి ఇసుక తిన్నెల మధ్య ఎత్తైన టవర్లపై సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పంటపై నిఘా పెడుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా ఇవి నిరంతరంగా పనిచేయాలనే ఉద్దేశంతో సోలార్ శక్తిని వినియోగిస్తున్నారు. ఈ కెమెరాలు అన్ని వైపులా తిరుగుతూ స్పష్టమైన చిత్రాలను రైతుల మొబైల్ ఫోన్లకు పంపిస్తాయి. పొలాల్లోకి ఎవరైనా అపరిచితులు ప్రవేశిస్తే సెన్సార్లు వెంటనే గుర్తించి పెద్ద శబ్దంతో సైరన్ మోగేలా వ్యవస్థను రూపొందించారు.
ఇప్పుడు రైతులు ఇంట్లో కూర్చునే తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తోటలో జరుగుతున్న ప్రతి చర్యను గమనిస్తున్నారు. దొంగల నుంచి పంటను రక్షించడమే కాకుండా, పనివాళ్ల పనితీరును కూడా పర్యవేక్షించగలుగుతున్నారు. అవసరమైనప్పుడు వెంటనే సూచనలు ఇవ్వడం కూడా సులభమవుతోంది. గతంలో రాత్రంతా పొలాల్లో కాపలా కాయాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు టెక్నాలజీ కారణంగా ఆ భారం తగ్గింది. ఈ మార్పుతో రైతుల్లో నమ్మకం పెరిగి, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది.
పంట రక్షణలో రైతులు తీసుకుంటున్న ఈ హైటెక్ చర్యలు ఇతర ప్రాంతాల రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. భద్రాచలం ఏజెన్సీ రైతులు చూపుతున్న ఈ మార్గం భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని మరింత సురక్షితంగా, లాభదాయకంగా మార్చే దిశగా ముందడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
