ఆంధ్ర ప్రదేశ్

మారుతున్న నెల్లూరు రాజకీయం.. చేతులు కలిపిన అనిల్‌, కాకాణి

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-సింహపురిలో మళ్లీ వైసీపీ గర్జన మొదలవుతోందా..? నేతల మధ్య విభేదాలతో పట్టు కోల్పోయిన ఫ్యాన్‌ పార్టీ… రెక్కలు కూడగట్టుకుని స్పీడ్‌ పెంచబోతోందా..? ఉప్పునిప్పుగా ఉండే జిల్లాలోని వైసీపీ కీలక నేతల మధ్య మళ్లీ దోస్తీ కుదిరిందా…? పరిణామాలు చూస్తుంటే వైసీపీకి పాజిటివ్‌గానే ఉన్నాయి. వారి స్నేహం కొనసాగితే… కలిసి పనిచేస్తే… నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగుండదని అంటోంది ఆ పార్టీ క్యాడర్‌. ఇంతకీ చేతులు కలిపిన ఆ ఇద్దరు నేతలు ఎవరు…? కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనికుమార్‌ యాదవ్‌… వీరిద్దరూ మాజీ మంత్రులు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి కీలక నేతలు. ఒకరకంగా… గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి.. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు కూడా కారణమే. ఎడమొహం, పెడమొహంగా ఉండే వీరిద్దరు… ఇప్పుడు మళ్లీ చేతులు కలిపారు. గ్రూప్‌ రాజకీయాలతో రచ్చకెక్కిన వీరు.. కలిసి పనిచేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇది చాలా శుభపరిమాణమని వైసీపీ శ్రేణులు సంతోషపడుతున్నారు. అసలు వీరిద్దరికీ గొడవలు ఎందుకు వచ్చాయి…?

Read also : ఎర్రం నాయుడు మళ్లీ పుట్టాడు.. అభిమానుల మనసుల్లో ఆనందం!

2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేసింది వైసీపీ. పదికి పది స్థానాలు దక్కించుకుంది. సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ను జగన్‌… తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. మంత్రి పదవి దక్కడంతో.. అనిల్‌ తీరు మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత రెండున్నరేళ్లకు కేబినెట్‌ నుంచి అనిల్‌ను తప్పించి.. కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు జగన్‌. దీంతో… ఇద్దరు నేతల మధ్య ముందు నుంచి ఉన్న గొడవలు బాగా పెరిగాయి. ఇద్దరి మధ్య అగాధం ఏర్పడింది. ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీసుకున్నారు. నేతల మధ్య విభేదాలు జిల్లాలో పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీశాయి. 2024 ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యేయి. ఓటమి తర్వాత కూడా అనిల్‌, కాకాణి.. కారాలు, మిరియాలు నూరుకున్నారు. అయితే… కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్‌తో సీన్‌ మారింది.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు ఎక్కువయ్యాయి. అక్రమ మైనింగ్‌తోపాటు పలు కేసుల్లో కాకాణి గోవర్దన్‌రెడ్డికి కూడా అరెస్ట్‌ చేశారు. 80రోజులపైగా జైల్లో ఉన్న కాకాణి.. ఇటీవల విడుదలయ్యారు. ఆ తర్వాత… అనిల్‌పై కూడా అక్రమ మైనింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి.. కాకాణి, అనిల్‌ మధ్య దూరం తగ్గుతూ వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాకాణి బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో.. కాకాణిని కలిశారు అనిల్‌కుమార్‌ యాదవ్‌. వైసీపీ ఆఫీసుకు వెళ్లి.. కాకాణిని కలిశారు. దీంతో.. ఇద్దరి మధ్య మళ్లీ దోస్తీ కుదిరిందని నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు అంటున్నారు. కేసుల వల్లనైనా వీరిద్దరూ కలిశారని సంబరపడుతున్నారు. వీరి మధ్య స్నేహం ఇలాగే కొనసాగి.. కలిసి పనిచేస్తే నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్వవైభవం వస్తుందని ఆశపడుతున్నారు.

Read also : మళ్లీ కేసీఆర్‌కు అస్వస్థత – ఆయన ఆరోగ్యానికి ఏమైంది…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button