తెలంగాణ

తెలంగాణలో చంద్రబాబు కోవర్టు పాలన: కేటీఆర్‌

రేవంత్‌ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది
అమాయకులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారు
ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చకు వెళ్లిన కేటీఆర్‌
సీఎం కోసం ప్రత్యేక కుర్చీ వేయించిన బీఆర్‌ఎస్‌

 

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టు పాలన నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డితో బహిరంగ చర్చ నిమిత్తం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌కు బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి కేటీఆర్‌ తరలివచ్చారు. బహిరంగ చర్చలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీ వేయించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో రైతు శ్రేయస్సుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ నిమిత్తం ప్రెస్‌క్లబ్‌కు వచ్చామని తెలిపారు. రేవంత్‌ రెడ్డి వస్తాడని అనుకుంటే ఆయన ఢిల్లీ వెళ్లారని… రేవంత్‌ బదులు డిప్యూటీ సీఎం, వ్యవసాయమంత్రి లేదా ఇంకా ఎవరైనా మంత్రులు వస్తారేమోనని ఆశించామన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఇంకా 670మందికి రైతుబంధు పడలేదని, వారి జాబితాను తీసుకొని వచ్చామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టు పాలన నడుస్తోందని, తెలంగాణ రైతులను మోసం చేస్తూ… నీళ్లు రేవంత్‌ గురువు చంద్రబాబుకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు సీఎం తొత్తులకు వెళ్లిపోతున్నాయని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని, సోషల్‌ మీడియాలో ఓ పోస్టును రీట్వీట్‌ చేసినందుకు బలహీనవర్గానికి చెందిన కార్యకర్తను అక్రమంగా అరెస్ట్‌ చేశారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to top button