
చౌటుప్పల్,క్రైమ్ మిర్రర్:- నేటి తరానికి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తి అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలో శుక్రవారం తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భహిరంగ సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. ఐలమ్మ పోరాటం ఫలితంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనను దహించివేసిందన్నారు. నాలుగు వేల మంది అమరుల త్యాగాలతో తెలంగాణ చరిత్ర తిరగరాసిందని, 10లక్షల ఎకరాల భూ పంపిణీకి ఆమె పోరాటమే నాంది పలికిందన్నారు. ఐలమ్మ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పనిచేసినప్పుడే సమాజంలో పేదరికం ఉండదని పేర్కొన్నారు. కులం, మతం గొప్పది కాదని, గొప్ప కులంలో పుట్టినంత మాత్రాన గొప్ప వ్యక్తులు కాలేరన్నారు. వ్యక్తిత్వాన్ని బట్టి గొప్పవాళ్లు అవుతారని తెలిపారు. అందరినీ ఆదరించి పేదవారి అభ్యున్నతి కోసం పోరాడేవాళ్లే చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. తాను చాకలి ఐలమ్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని రెయింబవుళ్ళు కష్టపడి మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రం లోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ…
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయం అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. భూ పెత్తందారులకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఐలమ్మ ఫ్యామిలీని ఎన్ని చిత్ర హింసలు పెట్టిన ఎత్తిన జెండా దించని వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. 1940 – 44 మధ్య విస్నూర్‌లో దేశ్‌ముఖ్, రజాకర్ అరాచకత్వానికి వ్యతిరేకంగా ఐలమ్మ ఎర్ర జెండాను ఎత్తిందని తెలిపారు. ఆమె ఆంధ్ర మహాసభతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీలోనూ చేరి, ఆమె నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చురుకుగా పని చేసిందని, నిజాంతో సహకరించిన భూస్వామ్య భూస్వాములకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యకలాపాలకు ఆమె ఇల్లు కేంద్రంగా ఉండేదని అన్నారు. గత గవర్నమెంట్ ఆమె చరిత్రను గుర్తించి పాఠ్య పుస్తకాల్లో చేర్చిందని. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళ యూనివర్సిటీకి ఐలమ్మ పెరు పెట్టిందని గుర్తు చేశారు. రజకులు బట్టలు ఉతికే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి గవర్నమెంట్ ఎక్స్ గ్రేషియా అందించే విధంగా చూడాలని కోరారు.
Read also : మండలంలోని పలు చెరువుల పరిశీలన!