Nitin Gadkari On Road Accidents: ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొద్ది రోజులు ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగ మంచు కారణంగా నిత్యం పదుల సంఖ్యలో ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించడంపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. రహదారి మరణాలు తగ్గించడమే లక్ష్యంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రాలకు అత్యాధునిక అంబులెన్సులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని రాజ్యసభలో ప్రకటించారు.
10 నిమిషాల్లో ప్రమాద స్థలానికి అంబులెన్స్!
రహదారులపై జరిగే ప్రమాద స్థలానికి 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరేలా తగిన చర్యలు చేపడుతున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం అధ్యయనం మేరకు ప్రమాద ఘటనా స్థలానికి అంబులెన్సు 10 నిమిషాల్లో చేరితే కనీసం 50వేల మందిని రక్షించగలిగే అవకాశం ఉండేదన్న విషయాన్ని గడ్కరీ గుర్తు చేశారు. ‘‘ప్రమాద బాధితులను రక్షించే వారిని ‘రహ్‌వీర్’ పేరుతో గౌరవించాలని, వారికి రూ.25 వేలు ప్రోత్సాహక బహుమతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది” అన్నారు.
రాష్ట్రాలకు అత్యాధునిక అంబులెన్స్ లు
“అంబులెన్సులను నడపడం జాతీయ రహదారుల బాధ్యత కాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలతో కిలోమీటర్ల పద్ధతిలో అంబులెన్సులను నడపడానికి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాం. కేంద్రం వారికి 100-150 అత్యాధునిక అంబులెన్సులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది’’ అని స్పష్టం చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 2026 చివరి నాటికి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో, ఏఐ ఆధారిత జాతీయ రహదారి యాజమాన్య పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు గడ్కరీ తెలిపారు. “ఇది అమలులోకి వస్తే టోల్ గేట్ల దగ్గర క్షణం కూడా ఆగాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.6వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది” అని నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు.





