V2V Communication Systems in Vehicles: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యాక్సిడెంట్ నివారణకు వెహికిల్ టు వెహికిల్ (వీ2వీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. డ్రైవర్‌కు రియల్‌టైంలో సమీపంలోని ఇతర వాహనాలు, స్పీడు, ప్రమాదకర ప్రాంతాలు తదితర వివరాలు పంపించి, తగిన హెచ్చరికలు చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయంతో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కార్లలో వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ
తాజాగా ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల రవాణా మంత్రుల వార్షిక సదస్సులో నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. సమాచారం పంపించడం కోసం కార్లలో వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. రోడ్డు నిర్మాణంలో తగిన మార్పులు చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గిస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించడం కోసం మోటారు వాహనాల చట్టంలో 61 సవరణలు తీసుకొస్తామని వెల్లడించారు.
రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి నగదు రహిత విధానంలో వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చే స్తామని గడ్కరీ తెలిపారు. ఈ విధానాన్ని త్వరలో ప్రధాని మోడీ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఈ విధానం ఆరు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందక మరణాలు సంభవిస్తున్నందున దాన్ని నివారించడానికే నగ దు రహిత వైద్య సేవలు అందించనున్నట్టు చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.1.5 లక్షల మేర, గరిష్ఠంగా వారం రోజుల పాటు చికిత్సలు అందించడమే ఈ పథకం లక్ష్యమన్నారు.





