క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి రూ. 9,584 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించినట్లు వెల్లడించింది. లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు తెలిపారు. ఈ నిధులలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోని సీవేజ్ (మురుగునీటి శుద్ధి) ప్రాజెక్టులకు కేటాయించారు.
పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ భారీ ప్రాజెక్టులతో పాటు, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కోసం రూ. 2,787 కోట్ల భూసేకరణ ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసింది.
అలాగే, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం గతంలో రూ. 30,425 కోట్ల ప్రాజెక్టులకు అనుమతినిచ్చింది. తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు తోఖాన్ సాహు బదులిస్తూ, తెలంగాణలో రూ. 9,584 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.





