క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా గ్రామాల్లో కుక్కల బెడదను నివారిస్తామని ఇచ్చిన హామీ మేరకు సుమారు 300 వీధి కుక్కలను సామూహికంగా హతమార్చిన 9 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివారల్లోకి వెళితే…
తెలంగాణ హనుమకొండ జిల్లాలో జనవరి 6 నుండి 8, 2026 మధ్య కాలంలో శాయంపేట మరియు ఆరేపల్లి గ్రామాల్లో సుమారు 300 వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపినట్లు జంతు సంక్షేమ కార్యకర్తల ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదైంది.
నిందితులలో ఇద్దరు సర్పంచ్‌లు, వారి భర్తలు, ఉప సర్పంచ్, ఇద్దరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు ఇద్దరు కూలీలు ఉన్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 325 మరియు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 లోని సెక్షన్ 11(1) కింద శాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైంది.
సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా గ్రామాల్లో కుక్కల బెడదను నివారిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అయితే మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఈ విషయంలో జోక్యం చేసుకుని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఉన్నతాధికారులను కోరారు.
ప్రస్తుతం పోలీసులు మరియు పశువైద్య అధికారులు కుక్కల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





