
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఆనాటి వైసీపీ ప్రభుత్వం… ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టింది. అంతేకాదు పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఈ కేసు హైకోర్టుకు చేరింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం జరిగింది…? కేసు వివరాలు ఏంటి…? కోర్టు ఏమంది…? ఒకసారి చూద్దాం.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో… వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించింది. ప్రభుత్వ పథకాలను.. వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయింది. అయితే… ఎన్నికల ప్రచారంలో ఈ వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం… అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. దాని వల్ల.. మహిళలు అపహరణకు గురవుతున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై.. గత ఏడాది ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఐదుగురు వాలంటీర్లు పవన్ కళ్యాణ్‌పై అఫిడవిట్ దాఖలు చేశారు. ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… కేసు మలుపు తిరిగింది. అఫిడవిట్ వేసిన ఐదుగురు వాలంటీర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ దగ్గర సంతకాలు తీసుకుని కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. దీంతో… పవన్ కళ్యాణ్‌పై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… గత ఏడాది నవంబర్ 18న… ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని హైకోర్టులో సవాల్ చేశారు ముగ్గురు వాలంటీర్లు. క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్ల తరపున న్యాయవాది శ్రావణ్‌కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి కనుక… కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోర్టును కోరారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసే నాటికి ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా అని ప్రశ్నించారు జడ్జి. అలాంటప్పుడు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాల్సిన అవసరం ఏముందని క్వశ్చన్ చేశారు. దీనిపై వాదనలు వినిపించాలని లాయర్లను ఆదేశించారు హైకోర్టు న్యాయమూర్తి. తదుపరి విచారణను వాయిదా వేశారు.