
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ సహా మరో 8మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చియార్డులో వైకాపా నేతలు కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కోడ్ ఉన్నా గుంటూరు మిర్చియార్డు పర్యటన పెట్టుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ఉన్నందున భద్రత ఇవ్వలేమని.. పర్యటన రద్దు చేసుకోవాలని కోరారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా గుంటూరు మిర్చియార్డుకు వచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని కూడా ఉన్నారు