
కూకట్ పల్లి, (క్రైమ్ మిర్రర్): వచ్చే వర్షాకాలం నేపథ్యంలో కూకట్ పల్లిలో నాళాల విస్తరణ, పూడికతీత పనులను తక్షణమే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌ను కోరారు.
మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జెడ్సీతో సమావేశమైన రమేష్, గత ఏడాది మాదిరిగా వరద ముంపు సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా అల్లాపూర్, బాలానగర్ వంటి ప్రాంతాల్లో నాళాల విస్తరణ చేపట్టకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
అలాగే కూకట్ పల్లి నియోజకవర్గం నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోందని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కేటాయింపులో ఎలాంటి లోటు ఉండకూడదని సూచించారు. సమస్యల పరిష్కారంపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు బండి రమేష్ తెలిపారు.