
Butantan-DV: ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న డెంగీ వ్యాధిని అరికట్టే దిశలో ఒక చారిత్రక ముందడుగు పడింది. వాతావరణ మార్పుల కారణంగా డెంగీ కేసులు రికార్డు స్థాయికి చేరిన ఈ సమయంలో, తొలి సింగిల్ డోస్ డెంగీ వ్యాక్సిన్‌కు బ్రెజిల్ ప్రభుత్వం ఆమోదం తెలపడం అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది. ఇప్పటివరకు లభ్యమైన వ్యాక్సిన్‌లను రెండు డోసులుగా తీసుకోవాల్సిన అవసరం ఉండగా, సావో పాలోలోని బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన బుటాంటన్ డీవీ అనే కొత్త వ్యాక్సిన్ మాత్రం కేవలం ఒక్క డోసుతోనే అవసరమైన రక్షణను అందించబోతోంది.
ఈ వ్యాక్సిన్‌ను 12 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి అందించనున్నారు. ఎనిమిదేళ్ల పాటు 16 వేల మంది వాలంటీర్లపై నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ తీవ్రమైన డెంగీపై 91.6 శాతం సమర్థతను చూపడం శాస్త్రవేత్తల్లో పెద్ద ఆశలను రెచ్చగొట్టింది. బ్రెజిల్ సైన్స్, ఆరోగ్య రంగాలకు ఇది ఒక చారిత్రక విజయమని సంస్థ డైరెక్టర్ ఎస్పర్ కల్లాస్ పేర్కొన్నారు. సంవత్సరాలుగా ప్రజలను వేధిస్తున్న ఈ వ్యాధిని కట్టడి చేయడానికి ఇది గొప్ప ఆయుధంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
డెంగీని చాలాసార్లు ‘బ్రేక్‌బోన్ ఫీవర్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని లక్షణాలు శరీరాన్ని తీవ్రమైన నొప్పులతో అత్యంత వేధింపులకు గురి చేస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో డెంగీ అంతర్గత రక్తస్రావానికి దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.46 కోట్ల కేసులు, 12,000 మరణాలు నమోదవగా, వీటిలో సగానికి పైగా మరణాలు బ్రెజిల్‌లో జరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఒకే డోసుతో పనిచేసే ఈ వ్యాక్సిన్ ఆమోదం ఎంతో ప్రయోజనకరంగా మారింది.
2026 ద్వితీయార్థానికి 30 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను అందించేందుకు చైనా సంస్థ వుసీ బయోలాజిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు బ్రెజిల్ ఆరోగ్య మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెంగీని నియంత్రించాలనుకునే దేశాలకు ఈ వ్యాక్సిన్ ఒక శక్తివంతమైన ఆయుధంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతలో ఇది ఒక కొత్త అధ్యాయాన్ని తెరువనుంది.
ALSO READ: Life happiness study: ఆ విషయంలో డబ్బు ఖర్చు చేసేవారు మస్త్ సంతోషంగా ఉంటారట!





