Homeతెలంగాణటార్గెట్ పొంగులేటి...!

టార్గెట్ పొంగులేటి…!

  • మంత్రి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ ఆరోపణలు

  • రాఘవ కన్ స్ట్రక్షన్స్ పనులన్నీ తెరపైకి

  • భూ దందాలకు పాల్పడుతున్నారంటూ ప్రచారం

  • పార్టీ పత్రికలో రోజువారీ సీరియల్ గా కథనాలు

  • తమ వాళ్ల దందాలు బయటకు రాకూడదనే

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో కొద్ది రోజులుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ఆరోపణలు, ఆలోచనలు అన్నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. మంత్రికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థ చేపడుతున్న పనులను ప్రస్తావిస్తూ పదునైన విమర్శలు చేస్తున్నారు. పొంగులేటిని టార్గెట్ చేయడం ద్వారా అంతిమంగా రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ పనిని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తన భుజాలకెత్తుకున్నారు.

హరీశ్ రావు ఏం చేసినా పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న మైనింగ్ శాఖను గతంలో కేటీఆర్ నిర్వహించగా.. ఆ సమయంలో ఎన్నెన్నో అక్రమాలు, అరాచకాలు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే బయటపెట్టారు. అంతేకాదు.. ఆ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ కూడా జరిపిస్తామని ప్రకటించారు. ఈ అక్రమాల్లో హరీశ్ రావు సోదరుడి ప్రమేయం ఉందని చెప్పారు. దీంతో ఉలికిపాటుకు గురైన హరీశ్ రావు.. తమ కుటుంబం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మంత్రి పొంగులేటిపై పడ్డారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నాదర్ గుల్ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 613లో 373 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించి ఏపీ ఐఐసీకి అప్పగించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వీటిని 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారు.

రైతులను భయపెట్టారంటూ..
నిషేధిత జాబితాలో ఉన్న నాదర్ గుల్ భూములకు సంబంధించి మంత్రి పొంగులేటి తన అధికార బలాన్ని ఉపయోగించి రైతులను భయపెట్టి దానిచుట్టూ ఫెన్సింగ్ వేశారని హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. దీంతో 600 మంది పేద రైతులు నష్టపోతున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రికి, హైడ్రాకు ఇదేవీ కనిపించడంలేదా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిని మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. నాదర్ గుల్ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, తిరిగి ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాఘవ కనస్ట్రక్షన్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా స్టోన్ క్రషింగ్ చేస్తోందని, మైనింగ్ చేస్తోందని హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా జీవో 111 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోందని అంటున్నారు. అయితే ఈ విషయంలో పొంగులేటికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని, రూ.2.74 కోట్ల జరిమానా వసూలు చేశామని ప్రభుత్వం చెబుతోంది.

ఖమ్మంలో రాజకీయంగా దెబ్బతీసినందుకే..
పొంగులేటిని బీఆర్ఎస్ టార్గెట్ చేయడం వెనుక మరో ప్రధానమైన కారణం ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలేనని అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న పొంగులేటి .. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను దెబ్బీతీయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో పొంగులేటి లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. తద్వారా కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెట్టాలని చూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు