
Pahalgam Terror Attak: పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందేనని తేల్చి చెప్పాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాల్సిందేనని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు బ్రెజిల్ లో జరుగుతున్న బిక్స్ శిఖరాగ్ర సదస్సులో ‘రియో డీ జెనీరో డిక్లరేషన్’ను సభ్యదేశాలు రిలీజ్ చేశాయి.
బ్రిక్స్ విడుదల చేసిన డిక్లరేషన్ లో ఏం ఏందంటే?
“ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నాం. క్రాస్ బార్డర్ టెర్రిరిజంతో పాటు ఉగ్రమూకలకు నిధులు అందిస్తూ, ఆశ్రయం కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థల పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం” అని అందులో వెల్లడించారు. అయితే, ఈ తీర్మానంలో పాకిస్తాన్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం విశేషం.
ఐరాసలో భారత్ కు శాశ్వత సభ్యదేశంగా స్థానం కల్పించాలన్న బ్రిక్స్
అటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ ను శాశ్వత సభ్యదేశంగా గుర్తించాలని బ్రిక్స్ దేశాలు డిమాండ్ చేశాయి. భద్రతా మండలిని సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పాయి. భారత్, బ్రెజిల్ కు భద్రతా మండలిలో మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు సభ్యత్వంలో మెరుగైనా ప్రాతినిధ్యం కల్పించాలని అభిప్రాయపడింది. అటు ప్రపంచ వాణిజ్యంలో ఏకపక్ష ఆంక్షలు, అధిక టారీఫ్‌లు, రక్షణాత్మక చర్యలపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా మిలిటరీ ఖర్చులు పెరగడం, విభజన ధోరణి పెచ్చరిల్లడం మంచిది కాదని అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత బలోపేతానికి రాజకీయ, శాస్త్రీయ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని బ్రిక్స్ దేశాలు పిలునిచ్చాయి.