
-
ప్రైవేట్ కార్యక్రమంలో స్టేజ్ ఎక్కనివ్వని పోలీసులు
-
మంత్రి సమక్షంలోనే చోటుచేసుకున్న ఘటన
-
మనస్థాపంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పున్న కైలాస్ నేత
చండూరు, క్రైమ్ మిర్రర్: నల్గొండ జిల్లా చండూరు మండలంలో రాజకీయంగా సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. డిసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాస్ నేతకు అవమానం జరిగిందంటూ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బిగ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ రమేష్ తండ్రి దశదినకర్మను బుధవారం చండూరు మున్సిపాలిటీ అంగడిపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు డిసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాస్ నేత హాజరయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టేజ్‌పై ఉండగా, డిసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాస్ నేత స్టేజ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.
స్టేజ్‌పైకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో పున్న కైలాస్ నేత తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ ఘటనపై ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు కూడా డిసీసీ ప్రెసిడెంట్ సామాన్యుల పక్కన కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా తనను స్టేజ్‌పైకి వెళ్లనీయకుండా చేయడం పట్ల పున్న కైలాస్ నేత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కావడమే ఈ అవమానానికి కారణమని పున్న కైలాస్ నేత వ్యాఖ్యానించారు.
ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తుండగా, జిల్లా రాజకీయాల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఆసక్తిగా మారింది.





