-
ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ లేఖ
-
మూడురోజుల్లో షెడ్యూల్ విడుదలకు అవకాశం.!
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అధికారికంగా లేఖ రాసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని, వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని లేఖలో కోరినట్లు సమాచారం.
ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన నేపథ్యంలో, వచ్చే మూడురోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే రాష్ట్ర రాజకీయాల్లో వేడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.
అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకులతో సమావేశాలు, క్షేత్రస్థాయిలో ప్రచారానికి సంబంధించి ఇప్పటికే కదలిక కనిపిస్తోంది. మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలు, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారనున్నాయి. ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న సమస్యలపైనే ఓటర్లు తమ తీర్పు చెప్పే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారనుందని, రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయని స్పష్టమవుతోంది.





