
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ నేతల్లో నిరాశ కనిపిస్తోంది. ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడారు. అదే వైసీపీకి పెద్ద షాక్ అని అనుకుంటుంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా అదే బాటలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. బొత్స… వైసీపీ వీడి.. కూటమిలో చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కానీ… బొత్స సత్యనారాయణ మాత్రం ఈ విషయంపై ఎక్కడా స్పందించడం లేదు. దీంతో ఇందులో నిజమెంతో అర్థంకావడంలేదు.
బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో సీనియర్ రాజకీయ నాయకుడు. ప్రజాబలం ఉన్న నేత. ఎలాంటి వివాదాన్ని అయినా సామరస్యంగా పరిష్కరించగలడని ఆయనకు పేరుంది. 2015లో కాంగ్రెస్ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. జగన్‌కు అండగా నిలిచారు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీని వదిలి కూటమి వైపు చూస్తున్నారని అంటున్నారు. ఈ వార్తలపై ఇప్పటి వరకు బొత్స క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టలేదు.
Also Read : టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీ..? – కండిషన్స్ అప్లై అంటున్న సోదరుడు చిన్ని
అసలు బొత్స పార్టీ మార్పు ప్రచారానికి కారణం ఏంటి? అంటే ఇటీవల రెండు, మూడు సార్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను బొత్స సత్యనారాయణ కలిశారట. పవన్‌తో సన్నిహితంగా ఉన్నట్టు కనిపించారట. దీంతో… బొత్స జనసేనలోకి వెళ్లిపోతున్నారన్న ప్రచారం మొదలుపెట్టేశారు. కథనాలు కూడా అల్లేశారు. బొత్సకు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందుకే అటువైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంకో అడుగు ముందుకేసి… రేపో మాపో బొత్స వైసీపీకి రాజీనామా చేసేస్తారని కూడా వార్తలు రాసేస్తున్నారు. కానీ.. బొత్స మాత్రం ఈ ప్రచారంపై మౌనం వహిస్తున్నారు. అస్సలు రియాక్ట్ అవ్వడంలేదు. పైగా విశాఖలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లో తిరగాలని దిశానిర్దేశం చేశారు.
Also Read : జగన్ భార్యపై దారుణమైన కామెంట్స్ చేసిన కిరణ్… చివరికి అరెస్ట్?
అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారాయన. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అలా అని వైసీపీ శ్రేణులు ఇంట్లో కూర్చోవద్దని.. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. సో బొత్సకు పార్టీ మారే ఆలోచన ఉంటే కూటమి సర్కార్‌పై ఇంకా విమర్శలు చేస్తారా? ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపిస్తారా? దీన్ని బట్టి ఆయన పార్టీ మార్పు వార్తల్లో ఎంత నిజముందో అందరికీ అర్థమవుతుంది.