
-
పెద్దల పంచాయతీలో కత్తులతో దాడి
-
ఇద్దరి దారుణహత్య, మరో ఇద్దరికి కత్తిపోట్లు
క్రైమ్ మిర్రర్, పెద్దపల్లి ప్రతినిధి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. సమస్య పరిష్కారానికి పెద్దమనుషులు ఏర్పాటు చేసిన పంచాయతీలో ఇరువర్గాలు కత్తులతో పరస్పరం దాడులకు దిగడంతో రక్తపాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఓ భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి కుటుంబీకులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. చర్చలు జరుగుతుండగానే, ఒక్కసారిగా మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది.
ఈ ఘర్షణలో భర్త తరపు బంధువులు, భార్య తరపు బంధువులపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో భార్య తరపు బంధువులు గాండ్ల గణేష్, మోటం మల్లేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు వ్యక్తులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.