
క్రైమ్ మిర్రర్, బాలాపూర్ : రాచకొండ కమిషనరేట్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ చౌరస్తాలో శుక్రవారం నాకాబంది నిర్వహించారు. ఈ తనిఖీలను ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు విజయవంతంగా నిర్వహించారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ పి.సుధీర్ బాబు ఆదేశాల మేరకు, అనుమానాస్పద వాహనాలు, అక్రమ రవాణా, చోరీ వాహనాలపై దృష్టి సారిస్తూ లెనిన్ నగర్ చౌరస్తాలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలు, నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు గుర్తించి సీజ్ చేసినట్టు చెప్పారు. ఇలాంటి తనిఖీలు నిత్యం నిర్దిష్ట సమయాల్లో ప్రధాన కూడళ్లలో నిర్వహిస్తున్నామని, విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు భద్రత కల్పించడం తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రానున్న పండుగ వేళల్లో ప్రజలందరూ శాంతియుతంగా, సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.“శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించము. చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు,” అని ఇన్స్పెక్టర్ నాగరాజు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గౌరీ నాయుడు, ట్రాఫిక్ ఆర్‌ఐ శ్రీశైలం, ఎస్ఐలు, ఇతర పోలీసులు పాల్గొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, సరైన పత్రాలతో ప్రయాణించాలన్నదే పోలీసుల విజ్ఞప్తి.