BJP’s Election Expenditure: ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ముమ్మర ప్రచారం చేయడంతో పాటు భారీగా డబ్బులు ఖర్చు చేస్తోంది. లోక్ సభతో పాటు ఎనిమిది రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా 2024-25లో బీజేపీ ఏకంగా రూ. 3,335.36 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు బీజేపీ వార్షిక ఆడిట్ నివేదికను సమర్పించింది.
రెండున్నర రెట్లు ఎక్కువ వ్యయం
2019-20 ఎన్నికల్లో రూ.1,352.92 కోట్లు బీజేపీ ఖర్చు చేయగా, దానికి రెండున్నర రెట్లు ఎక్కువగా గత ఎన్నికల్లో వ్యయం చేసింది. 2024 మార్చి 16న 18వ లోక్‌సభ కోసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఆ ఏడాది ఏప్రిల్ 19న మొదలైన పోలింగ్ 44 రోజుల పాటు కొనసాగింది. ఇక అంతకుముందు ఏడాది కూడా ఎన్నికల ప్రచారానికి దాదాపు రూ. 1,754 కోట్లు ఖర్చు చేసింది. 2025 డిసెంబరు 27న ఈసీకి బీజేపీ ఆడిట్ నివేదిక సమర్పించగా, దానిని ఈసీ ఇటీవలే ప్రచురించింది.
2024-25లో మొత్తం ఖర్చు రూ. 3,774.58 కోట్లు
వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25లో బీజేపీ మొత్తం ఖర్చు రూ. 3,774.58 కోట్లలో 88 ఎన్నికల వ్యయమే ఉంది. ఇక ఆ ఎన్నికల వ్యయంలో రూ.2,257 కోట్లు ప్రచార ప్రకటనలకే ఖర్చు చేశారు.
భారీగా పెరిగిన బీజేపీ ఆదాయం
ఇక బీజేపీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. 2023-24లో రూ.4,340.47 కోట్లు ఉండగా, 2024- 25లో అది రూ. 6,769.14 కోట్లకు చేరింది. ఈ ఆదాయంలో స్వచ్ఛంద విరాళాల నుంచి రూ. 6,124. 85 కోట్లు రాగా, మిగిలిన డబ్బు చందాలు, ఫీజులు, బ్యాంకు నిల్వలపై వడ్డీలు తదితర రూపంలో సమకూరింది. ఇక 2025 మార్చి 31 నాటికి తమ వద్ద సాధారణ నిధిలో నగదు, డిపాజిట్లు సుమారు రూ. 10 వేల కోట్లు ఉన్నట్లు బీజేపీ తెలిపింది.





