
గట్టుప్పల్, (క్రైమ్ మిర్రర్): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సచివాలయం ముట్టడి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత రేపింది. ఈ సందర్భంగా అనేకమంది పార్టీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్బంధాలకు గురి చేయడం బీజేపీ తీవ్రంగా ఖండించింది.
గట్టుప్పల్ మండలం బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి చిలువేరు దుర్గయ్య మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి పోలీసులు చేసిన అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటం ఎప్పటికీ ఆగదు. అక్రమ అరెస్టులు చేసి ఈ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు అని హెచ్చరించారు.
బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమైన ఈ ప్రభుత్వం అవినీతి, అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోంది. దీనిపై ప్రజా పోరాటం మరింత ఉధృతం అవుతుంది అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నాగులగాని శ్రీనివాస్, ఈడేం రాజు, విరమళ్ళ రాజుగౌడ్, శ్రీశైలం, శంకర్, యాదగిరి, బిక్షం, రమేష్, రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.