
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటింది. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందనే టాక్ వస్తోంది. పార్టీలోనూ ఆయనను సీనియర్ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్ రెడ్డిని మారుస్తారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం కర్ణాటక. అక్కడ సెప్టెంబర్ లో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు. సిద్దరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ను సీఎం చేస్తారని తెలుస్తోంది. కర్ణాటక కాగానే తెలంగాణలోనూ ముఖ్యమంత్రిని మారుస్తారనే టాక్ వస్తోంది. డిసెంబర్ 7కు రేవంత్ పాలనకు రెండేళ్లు అవుతుంది. ఆ సమయానికే రేవంత్ రెడ్డిని మార్చి కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా తెలంగాణ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ లో రేవంత్ రెడ్డిని మారుస్తారని చెప్పారు. ఆ విషయం తెలిసే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ భజన చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు హామీపై కాంగ్రెస్ సర్కారు కేంద్రాన్ని బద్నాం చేసే రాజకీయాలు చేస్తూ బీసీలను మోసం చేస్తోందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 420 హామీలతోపాటు బీసీ రిజర్వేషన్ల హామీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిధర్నాకు కాంగ్రెస్ అగ్రనేతలే ముఖం చాటేసారని తెలిపారు.
గత ఏప్రిల్ నెలలో కూడా బీసీ సంఘాలతో రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెట్టించిన ధర్నాకు కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ముఖం చాటేసారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ పరిణామాలన్నీ రేవంత్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ విశ్వాసం పోయిందని రుజువు చేస్తున్నాయన్నారు. సీఎం కుర్చీని కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి బీసీ డ్రామా ఆడుతూ, రాహుల్ భజన,మోడీ దూషణ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతి, ఒంటెత్తు పోకడ, ఏకపక్ష వైఖరితో విసిగిపోయిన కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రిని మార్చాలని చూస్తోందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చాలా కాలంగా రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇది గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీ కాపాడుకునేందుకు రాహుల్ భజన చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
బీసీ కోటా బిల్లును ఆమోదించకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుతామని, అసలు మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రధాని మోదీ ని దూషించడం ద్వారా గాంధీ కుటుంబ మెప్పును పొందాలని చూస్తున్నారని.. తన స్దాయికి మించి ప్రధాని విమర్శించడం ద్వారా రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఇచ్చే బీసీ రిజర్వేషన్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు రాలేనని సోనియా లేఖ రాస్తే, అది తనకు నోబెల్, ఆస్కార్ అవార్డుతో సమానం అంటూ ఆస్కార్ లెవల్లో నటించిన రేవంత్ రెడ్డి డ్రామాలను హైకమాండ్ పెద్దలు గ్రహించారు. అందుకే నిన్నటి బీసీ ధర్నాకు వాళ్లెవరూ రాలేదు. దీంతో రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు.