తెలంగాణ

BJP Protest: ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ.. రైతులను కాంగ్రెస్ ముంచుతుందన్న బీజేపీ!

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలవడంతో పూర్తిగా విఫలం అయ్యిందిని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పిండి పాపిరెడ్డి ఆరోపించారు. సరిగా ధాన్యం కొనుగోలు చేయక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.

BJP Leaders Protest At Nalgonda: కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పిండి పాపిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతుల మీద హామీల వర్షం కురిపించి.. గద్దెనెక్కిన తర్వాత నట్టేట ముంచుతుందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో పాపిరెడ్డి పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు

ఈ సందర్భంగా మాట్లాడిన పాపిరెడ్డి.. ధాన్యం కొనుగోళ్లలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయన్నారు. ఐకేపీ నిర్వాహకుల నుంచి మొదలుకొని అధికారులు, మిల్లుల యాజమాన్యల వరకు రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడి క్వింటాల్ కు 2,3 కేజీల చొప్పున కట్‌ చేస్తున్నారని ఆరోపించారు. లారీలు రావడం లేదంటూ రైతుల నుంచి బస్తాకు రూపాయి చొప్పున అదనంగా డబ్బులు వసూళు చేస్తున్నారని మండిపడ్డారు.

దీక్ష విరమింపజేసిన ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

అటు ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి పాల్గొని, దీక్షకు మద్దతుల పలికారు.  దీక్ష చేస్తున్న గోలి మధుసూదన్‌ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, ఎన్నికల సందర్భంగా సవాలక్ష హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ..  అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోడం మానేసిందన్నారు. రైతుబంధు ఇవ్వడం లేదని, రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదన్నారు. వర్షాలకు నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీకి పేరు వస్తుందనే.. పసల్‌ బీమాను అమలు చేయడం లేదని విమర్శించారు మహేశ్వర్ రెడ్డి.

ఈ దీక్షా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, నాయకులు పిల్లి రామరాజు, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పోతేపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, పకీర్‌ మోహన్‌రెడ్డి, సురకంటి రంగారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ఓరుగంటి వంశీ సహా పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button