
ఏపీ కూటమిలో బీజేపీ కరివేపాకులా మారిందా..? ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం అన్నట్టు కాషాయ పార్టీకి పదవుల పంపకం జరుగుతోందా..? కమలం పార్టీలో కలవరానికి కారణం ఏంటి…? నామిటేడెట్ పోస్టుల భర్తీతో మొదలైన ఈ అసంతృప్తి ఎక్కడికి దారి తీస్తుంది..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ అనే కంటే… కూటమి పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ డ్రామానే హైలెట్ అవుతోంది. ఒక విషయంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు రాజకీయాలు సాగితే… మరో విషయంలో టీడీపీ, జనసేన వర్సెస్ బీజేపీ అన్నట్టు సీన్ మారుతోంది. మొత్తం కూటమిలోని మూడు పార్టీలు పైకి సయోధ్య నటిస్తున్నా… అంతర్గత విభేదాలు మాత్రం తప్పడంలేదు. ఇదంతా ఎందుకంటే… ప్రస్తుతం ఏపీ బీజేపీలో అసంతృప్తి పెరుగుతోందంట. కూటమిలో తమకు కరివేపాకులా తీసేస్తున్నారని… కమలం పార్టీ నేతలు కస్సు మంటున్నారట. కక్కలేక.. మింగలేక.. గొంతులో వెలక్కాయ పడినట్టు ఉంటున్నారట.
Also Read : టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
అసలు ఏం జరిగిందో… ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోంది అని బీజేపీ బాధపడుతోంది. టీడీపీ, జనసేన పార్టీలు ఎక్కువ పోస్టులు తీసుకుని… తమకు మాత్రం ఏదో అలా… ఒకటో, రెండో విదిలిస్తున్నారన్నది బీజేపీ వాదన. వాస్తవంగా వారి వాదన కరెక్టే. ఎందుకంటే… ఏపీలో ఇప్పటి వరకు రెండు విడతల్లో మార్కెట్ కమిటీ పదవులు భర్తీ చేసింది ఏపీ ప్రభుత్వం. మొదటి విడతలో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. అందులో బీజేపీ ఇచ్చింది రెండే రెండు. పోనీ.. రెండవ విడతలో ఆ సంఖ్య ఏమైనా పెంచారా అంటే.. అదీ లేదు. రెండో లిస్ట్‌లో మరో 38 కమిటీలకు చైర్మన్లను ప్రకటిస్తే… అందులో బీజేపీకి దక్కింది ఒక్కటంటే ఒక్కటే. తమ పార్టీకి బలం తక్కువగా ఉన్నా… మరీ ఇంత విలువ లేకుండా చూస్తారా అని బీజేపీ నేతలు వాపోతున్నారు.
Also Read : కూటమిలో నాగబాబు చిచ్చు – పిఠాపురంలో రాజుకున్న నిప్పు..!
మూడో లిస్ట్ ఇస్తే… అందులో బీజేపీ ఇచ్చిన పదవుల సంఖ్య జీరో ఉంటుందా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా చెప్పకపోయినా… నామినేటెడ్ పోస్టుల భర్తీపై బీజేపీ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉందని… ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. టీడీపీ, జనసేనతోపాటు బీజేపీ కూడా కలిస్తేనే.. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటైందని… అలాంటప్పుడు… నామినేటెడ్ పదవుల పందారంలో ఈ వ్యత్యాసం ఏంటని ఏపీ బీజేపీ నేతలు కాస్త గట్టిగానే గొనుగుతున్నారు. మరి మూడో లిస్ట్‌లో అయినా బీజేపీకి ప్రాధాన్యం ఇస్తారా…? లేదా..? అన్నది చూడాలి.