
క్రైమ్ మిర్రర్, ఆన్‌లైన్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెలువడనుండగా, ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ఈ అంచనాలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఫలితాల రోజున పెద్ద ఎత్తున వేడుకలు చేసుకోవడానికి పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. పట్నాలో 501 కిలోల లడ్డూల ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఆ సంబరాల సన్నాహాలు స్పష్టమయ్యాయి.
ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. “ఫలితాల రోజు హోలీ, దీపావళి, దసరా, ఈద్ పండగలన్నీ కలిపి ఒకేసారి జరుపుకుంటాం. ఓటర్లు అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమిని ఆశీర్వదించారు” అని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పంచేందుకుగానూ ఈ లడ్డూలను తయారు చేయించారని చెప్పారు. లడ్డూ తయారీదారు కూడా ఆర్డర్ ధృవీకరిస్తూ, నవంబర్ 14 ఉదయానికి డెలివరీ చేస్తామని పేర్కొన్నారు.
బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 66.91 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1951 తర్వాత అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించారు. “సర్వే సంస్థలు బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయి” అంటూ విమర్శించారు. ఫలితాల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. భవిష్యత్తుకు భద్రత: సీఎం చంద్రబాబు





