Bihar Assembly Elections: బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతోంది. ఈ నెల 20న ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
అమిత్ షాతో జేడీయూ కీలక చర్చలు
తాజాగా జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝాతో పాటు ఎన్డీయే సీనియర్ నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గం కూర్పుపై కీలక చర్చలు జరిపారు. మంత్రుల విషయంలో ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం బీజేపీకి 15 నుంచి 16, జేడీయూకు 14, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ (ఆర్వీ)కి 3, జితిన్ రామ్ మాంఝీ హెచ్ఏఎం(సెక్యులర్)కు ఒకటి, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ ఆర్ఎల్‌ఎంకు ఒక మంత్రి పదవి దక్కనున్నాయి. నితీష్ కుమార్ పేరును సీఎంగా ఎన్డీయే అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, ఆయనకు పాశ్వాన్, మాంఝీ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. అప్పటిలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఎన్డీయే కూటమి ఊహించని విజయం
ఇక తాజాగా వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. నితీష్ 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన తర్వాత కూడా ఎన్డీయే మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. 243 అసెంబ్లీ స్థానాల్లో 202 సీట్లు దక్కించుకుంది. బీజేపీ 89 స్థానాల్లో గెలిచి ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లతో ఆ తర్వాత స్థానంలో ఉంది. ఎల్జేపీ-ఆర్వీ 19 సీట్లు, హెఏఎం(ఎస్) 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి. విపక్ష పార్టీలు తమ బలాన్ని గత ఎన్నికలతో పోల్చితే మరింత కోల్పోయాయి.





