
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ చెలరేగింది. రేపు (నవంబర్ 14) ఓట్ల లెక్కింపు జరగనుండగా, రాష్ట్రంలో అధికార పగ్గాలు ఎవరి చేతిలోకి వెళ్తాయనే ప్రశ్న అందరినీ ఆకర్షిస్తోంది. ఎన్డీయే మరోసారి గద్దెనెక్కుతుందా, లేక మహాఘట్బంధన్ కూటమి పాలనలోకి వస్తుందా అన్నదానిపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో ఆర్జేడీ నేత సునీల్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి తారుమారు జరిగితే బీహార్‌లో పెద్ద ఎత్తున అశాంతి నెలకొంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజా తీర్పును వక్రీకరించే ప్రయత్నం చేస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో నిరసనలు తప్పవని అధికారులకు స్పష్టం చేశారు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థులు బలవంతంగా ఓడిపోయారని ఆరోపిస్తూ, ఈసారి కూడా ప్రజల అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం జరిగితే భారీ ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు.
తమ పార్టీ తేజస్వీ యాదవ్ నేతృత్వంలో కనీసం 140 నుండి 160 సీట్లు గెలుచుకుంటుందని సునీల్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకుంటే వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను విస్మరించి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు వీధుల్లోకి వస్తారని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సునీల్ సింగ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
243 స్థానాలున్న బీహార్‌లో ఎన్నికలు రెండు దశల్లో పూర్తయ్యాయి. అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. దాదాపు పది వరకు సంస్థలు ఇచ్చిన సర్వే ఫలితాలు కూడా ఇదే సూచించాయి. అయితే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాత్రం ఈ అంచనాలను ఖండిస్తూ, ప్రజల తీర్పు తమ పక్షాన ఉంటుందని, ఈసారి ఆర్జేడీనే అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ALSO READ: Office Romance: భారత్‌లో పెరుగుతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. ఎన్నో స్థానం అంటే..?





