జాతీయం

PM Modi: కాంగ్రెస్‌ కాదు, అదో ముస్లిం లీగ్‌-మావోయిస్ట్‌ పార్టీ.. బీహార్ విజయం తర్వాత ప్రధాని మోడీ ఎద్దేవా!

PM Modi Satires On Congress: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పరాన్న జీవి పార్టీగా మారిందన్న ఆయన, త్వరలో ముక్కలు కాబోతోందన్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిన తర్వాత.. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ ముస్లిం లీగ్‌-మావోయిస్ట్‌ పార్టీలా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మునగడంతో పాటు దానితో జతకట్టిన పార్టీలను కూడా ముంచుతోందని ఎద్దేవా చేశారు. హస్తం పార్టీతో జాగ్రత్తగా ఉండాలని ఆయా పార్టీల నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ నేతలే ఆ పార్టీ అధిష్టాన విధానాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ త్వరలో మరోసారి ముక్కలు కాబోతుందని జోస్యం చెప్పారు.2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 3లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కనీసం మూడంకెల సీట్లను సాధించలేకపోయిందని మోడీ ఎద్దేవా చేశారు.

సుపరిపాలనకే బీహారీ ప్రజల పట్టం

చెత్త రాజకీయలను,  మభ్యపెట్టే మాటలను బీహార్‌ ఓటర్లు తిరస్కరించారని ప్రధాని మోడీ చెప్పారు. సుపరిపాలనకు పట్టం కట్టారన్నారు. విపక్షాలు ముస్లిం-యాదవ్‌ అనే సూత్రంతో ముందుకు వెళ్తే, ఎన్డీయే సామాజిక సంక్షేమం, న్యాయం పేరుతో ఎన్నికల బరిలోకి దిగిందన్నారు. తాజా విజయంతో బీహార్‌ మహిళలు, యువత ఎన్డీయేకు కొండంత అండగా నిలిచారని చెప్పారు. బీహార్‌లో ఇక ఎప్పటికీ జంగిల్‌ రాజ్‌ ప్రభుత్వం తిరిగి రాదన్నారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ విజయానికి మార్గం సుగమం చేసిందన్న ప్రధాని..  బెంగాల్‌ లోనూ జంగిల్‌ రాజ్‌ను తొలగిస్తామన్నారు.

బీహార్ లో దుమ్మురేపిన ఎన్డీయే కూటమి

ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. 243 స్థానాలకు గాను 202 సీట్లలో ఘన విజయం సాధించింది. బీజేపీ 101 సీట్లలో పోటీ చేసి ఏకంగా 89 స్థానాల్లో విజయం సాధించింది. చిరాగ్‌ పాశ్వాన్ పార్టీ.. 28 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో గెలిచింది. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 101 సీట్లలో పోటీ చేసి 85 స్థానాల్లో గెలుపును సొంతం చేసుకుంది. బీహార్లో కాంగ్రెస్‌, ఆర్జేడీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లు సాధించిన ఆ కూటమి ఈసారి కేవలం 35 సీట్లకు పరిమితం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button