Bihar Assembly Results 2025: బీహార్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నప్పటికీ.. ఓటర్లు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. ఏకంగా 200లకు పైగా స్థానాలను కట్టబెట్టారు. విపక్షకూటమికి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చేశారు. ఈ ఎన్నికలు బీహార్ లో ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. అందులో ఒకటి పాతికేళ్ల యువతి మైథిలి ఠాకూర్ విజయం. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె కొమ్ములు తిరిగిన ప్రత్యర్థులను ఓడించి జయకేతనం ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 50 శాతం ముస్లీం ఓట్లరు ఉన్నా సరే, ఆమె అద్భుత విజయాన్ని సాధించారు.
ఇప్పటి వరకు అలీనగర్ లో గెలవని బీజేపీ
నిజానికి అలీనగర్ నియోజకవర్గం2008లో ఏర్పడింది. ఇక్కడ దాదాపు 50 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో బీజేపీ గెలవలేదు. అలాంటి స్థానం నుంచి పోటీ చేసిన 25 ఏళ్ల మైథిలి ఠాకూర్.. ఘన విజయం అందుకున్నారు. జానపద గాయనిగా మైథిలి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, భోజ్ పురిలో ప్రదర్శనలు ఇచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే ప్రధాని మోదీ కూడా ఆమెను పలుమార్లు ప్రశంసించారు.
ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మైథిలి
బిహార్ ఎన్నిలకు కొద్దివారాల ముందే మైథిలి బీజేపీలో చేరారు. సగానికి పైగా ముస్లీం ఓటర్లు ఉన్నా, అందరి దగ్గరికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. తాజా ఎన్నికల్లో మైథిలి తన సమీప ప్రత్యర్థి, ఆర్జేడీ సీనియర్ నేత వినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బిహార్ లో గెలుపొందిన అత్యంత పిన్నవయస్కురాలైన ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మైథిలికి కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారు. 2000 జూలై 25న జన్మించిన మైథిలి.. 11 ఏళ్ల వయసులోనే సరిగమప లిటిల్ చాంప్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఇండియన్ ఐడల్ జూనియర్ పోటీల్లోనూ పాల్గొన్నారు. 2017లో రైజింగ్ స్టార్ కార్యక్రమంలో రన్నప్ గా నిలిచారు. అక్కడి నుంచి ఆమెకు మంచి ఆదరణ లభించింది.





