Bihar Assembly Results 2025: ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ కు ఊహించని ఎదరుదెబ్బ తగిలింది. ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడేందుకు తానే కారణం అయ్యానని చెప్పుకునే పీకే.. బీహార్ లో ఒక్కటంటే ఒక్కసీటు గెలవలేకపోయారు. అత్యంత విజయవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్.. అట్టర్ ఫ్లాప్ షో కనబర్చాడు.
సింగిల్ సీటు గెలవని జన్ సురాజ్ పార్టీ
రాజకీయ వ్యూహకర్తగా బీజేపీ, జేడీ(యూ), కాంగ్రెస్, ఆప్, వైసీపీ, డీఎంకే, టీఎంసీ లాంటి పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించి.. ముఖ్యమంత్రి పీఠాలపై కూర్చోబెట్టిన పీకే.. పార్టీ అధినేతగా బీహార్ లో సింగిల్ సీటు కూడా గెలవలేకపోయాడు. జన్ సురాజ్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసి.. బీహార్ అంతటా పాదయాత్ర చేశాడు. రాష్ట్రంలో కుల, అవినీతి రాజకీయాలకు తన పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చారు. 3 వేల కిలో మీటర్లు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన పాదయాత్రకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చినప్పటికీ, ఓట్ల దగ్గరికి వచ్చే వరకు నమ్మలేకపోయారు.
పీకే ఎక్కడ విఫలం అయ్యారు?
పీకే ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. బీహార్ లో మార్పు తనతోనే సాధ్యం అని చెప్పిన ఆయన, ప్రసంగాలతో దుమ్మురేపిన ఆయన, మేనిఫెస్టో విషయానికి వచ్చే సరికి ఏం చేస్తారు సరిగా చెప్పలేకపోయారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లబోతున్నారనే విషయం ప్రజలకు వివరించలేకపోయారు. 200 పైగా స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించారు. అలా కాకుండా తమ పార్టీ ప్రభావం చూపించే స్థానాలను గుర్తించి, అక్కడే అభ్యర్థలును దింపితే పరిస్థితి మరోలా ఉండేది. అదే సమయంలో పీకే పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీలలో చాలా వీక్ గా ఉంది. గతంలో బీజేపీ, జేడీయూలకు అనుకూలంగా పని చేసిన పీకే, ఇప్పుడు అదే పార్టీలకు వ్యతిరేకంగా పని చేయడాన్ని జనాలు జీర్ణించుకోలేదు. అదే సమయంలో, పార్టీ అధినేతగా ప్రశాంత్ కిశోర్ పోటీకి దిగకపోవడం పెద్ద మైనస్ గా మారింది. మొత్తంగా తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే 3.44 శాతం ఓట్లతో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకున్నారు.





