క్రైమ్ మిర్రర్, ఏపీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను మార్చబోతున్నారా? ఆమె స్థానంలో కొత్త వ్యక్తి అధ్యక్షుడు అవుతారా? ఈ మేరకు కాంగ్రెస్ నాయకత్వం సంకేతాలు పంపించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా ఏపీకి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో షర్మిలపై ఫీడ్ బ్యాక్ రాలేదని తెలుస్తోంది. ఆపై సీనియర్ల నుంచి విముఖత రావడంతో షర్మిల మార్పు వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ లో విలీనం..
తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావించారు షర్మిల. అందుకు అభ్యంతరాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలను తీసుకున్నారు. ఏపీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యత తీసుకొని రాష్ట్రంలో అడుగుపెట్టారు. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డితో తలెత్తిన విభేదాలతో ఆయనను టార్గెట్ చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ బలహీనపడడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కారణంతో ఆ పార్టీ సైతం ఆగ్రహంగా ఉండేది. అలా కాంగ్రెస్ నాయకత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో.. షర్మిల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఆ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పురోగతి లేదు. ఆపై షర్మిల సీనియర్లను కలుపు కెల్లడం లేదన్న విమర్శ ఉంది. అందుకే ఇప్పుడు ఆమెను మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
పళ్లం రాజు పేరు..
అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పళ్లం రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించారు పళ్లం రాజు. ఆయనకు పార్టీ విధేయుడన్న మంచి పేరు ఉంది. ఆయన అయితే పార్టీని సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్తారన్న నమ్మకం కాంగ్రెస్ నాయకత్వం లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రకాల కష్టాలు వచ్చినా పల్లం రాజు మాత్రం పార్టీలోనే కొనసాగారు. ఒకానొక దశలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెగ ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.
ఏఐసీసీలోకి షర్మిల..
అయితే షర్మిలను మార్చితే ఆమె సేవలను కేంద్ర రాజకీయాల్లో వినియోగించుకుంటారని తెలుస్తోంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలోకి ఆమెను తీసుకుంటారని సమాచారం. ఇటీవల రాహుల్ గాంధీ పర్యటనలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అధినాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పక్కన ఉన్న కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉండడంతో.. ఏపీలో సైతం పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఉంది. చూడాలి నిర్ణయాలు ఎలా ఉంటాయో?
