
Bhogi 2026: తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మూడు రోజుల పాటు సాగే ఈ పండుగ సంబరాల్లో తొలి రోజైన భోగి పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, సామాజిక ప్రాధాన్యం ఉంది. అయితే 2026 సంవత్సరంలో భోగి పండుగ తేదీ విషయంలో కొంత సందిగ్ధత నెలకొనడంతో సామాన్య ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13న భోగి జరుపుకుంటుండగా, ఈ ఏడాది మాత్రం పంచాంగ గణనల ప్రకారం తేదీ మార్పు ఉంటుందని పండితులు స్పష్టం చేశారు.
జ్యోతిష్య నిపుణులు, పంచాంగకర్తల అభిప్రాయం ప్రకారం.. 2026 సంవత్సరంలో సంక్రాంతి పర్వదినాలు జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ఆధారంగా చేసుకుని సంక్రాంతి పండుగ తేదీలను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో జనవరి 14 బుధవారం రోజున భోగి పండుగను, జనవరి 15న మకర సంక్రాంతిని, జనవరి 16న కనుమ పండుగను జరుపుకోవడం శాస్త్రోక్తమని పండితులు చెబుతున్నారు. జనవరి 13 మధ్యాహ్నం నుంచి షట్తిల ఏకాదశి తిథి ప్రారంభమై, జనవరి 14 సాయంత్రం వరకు కొనసాగుతుండటంతో 14వ తేదీనే భోగి వేడుకలు నిర్వహించుకోవడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.
భోగి పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది తెల్లవారుజామున వెలిగించే భోగి మంటలు. దక్షిణాయన కాలంలో పేరుకుపోయిన పాత వస్తువులు, పనికిరాని సామాన్లను అగ్నికి సమర్పించడం ద్వారా పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదానికి స్వాగతం పలకడమే ఈ ఆచారం వెనుక ఉన్న భావన. ఇది కేవలం బాహ్య శుద్ధికే కాదు.. అంతర్గతంగా మనసులో ఉన్న చెడు ఆలోచనలు, అలవాట్లను కూడా త్యజించాలనే సంకేతంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా భోగి మంటను అగ్నిహోత్రంతో పోల్చుతారు. ఆ మంటల నుంచి మిగిలే భస్మాన్ని నుదుట ధరిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభఫలితాలు లభిస్తాయని పెద్దల విశ్వాసం.
భోగి పండుగతో పాటు నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస వ్రతం కూడా ముగింపుకు వస్తుంది. పురాణ కథనాల ప్రకారం గోదాదేవి శ్రీరంగనాథుడిని పతిగా పొంది స్వామిలో ఐక్యమైన పవిత్ర దినంగా భోగిని భావిస్తారు. అందుకే ఈ రోజున ఆలయాల్లో గోదా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వివాహం కాని యువతులు ఈ కళ్యాణాన్ని దర్శించి, అక్కడి అక్షతలను తలపై వేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని, మంచి వరుడు లభిస్తాడని నమ్మకం.
భోగి రోజున అభ్యంగన స్నానం చేసి, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో లక్ష్మీదేవిని ఆహ్వానించడం తెలుగు సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. సాయంత్రం వేళ చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా రేగు పళ్లను తలపై పోసే ఆచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రేగు పండును అర్క ఫలమని పిలుస్తారు. ఇది సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. ఈ పండ్లను పిల్లలపై పోయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, దృష్టి దోషాలు తొలగిపోతాయని సంప్రదాయం చెబుతోంది. పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదానికి స్వాగతం పలికే ఈ భోగి పండుగ 2026 జనవరి 14న తెలుగు ఇళ్లలో కొత్త వెలుగులు, కొత్త ఆశలు నింపాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.
ALSO READ: మాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు





