బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రధాని మోడీ సమయం ఇస్తే బీసీ బిల్లుపై చర్చించేందుకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని ఎంపీలను కోరారు. నిర్దేశిత ఫార్మాట్‌లో వాయిదా తీర్మానం ఇవ్వాలని లేదంటే ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు పెట్టాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలు ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని కోరారు.
ఎంపీలతో డిప్యూటీ సీఎం సమావేశం
త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర ఎంపీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్‌కుమార్ యాదవ్, బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, నగేష్ పాల్గొన్నారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలతోపాటు 12శాఖలకు సంబంధించిన 47అంశాలపై ఇందులో చర్చించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే సమావేశం
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకతీతంగా ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేశామని భట్టి తెలిపారు. పార్లమెంట్‌లో ఎంపీలు అడగాలనుకునే సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నించాలన్నా, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలన్నా…నిర్దేశిత ఫార్మాట్‌లో సమాచారాన్ని ఎంపీలకు అందిస్తామని వివరించారు. కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై గతంలోనే కేంద్రానికి లేఖలు రాశామని గుర్తు చేశారు. ప్రత్యేక విభాగంలో ఆ లేఖలు అందుబాటులో ఉంటాయని, వాటి ఆధారంగా కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. దేశ, విదేశాల్లోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కమిటీలు వేస్తున్నామని, ఆసక్తిగల వారు పేర్లు ఇస్తే కమిటీల్లో సభ్యులుగా వేస్తామన్నారు. ఎంపీలకు తెలిసిన ప్రముఖులు, దిగ్గజ సంస్థల వివరాలు ఇస్తే.. వారినీ సమ్మిట్‌కు ఆహ్వానిస్తామన్నారు.





