Bengaluru Techie Murder Case: సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి వేళ ఆమె ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. తన కోరిక తీర్చమని బలవంతపెట్టాడు. ఆమె కాదనటంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ సంఘటన బెంగళూరులో సంచలనం కలిగించింది.
అసలు ఏం జరిగిందంటే?
బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల డీకే షర్మిళ అనే యువతి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తోంది. రామమూర్తి నగర్, సుబ్రమణి లేఅవుట్లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. షర్మిళ పక్క ఫ్లాట్‌లో కర్నల్ కురయ్ అనే యువకుడు ఉంటున్నాడు. కర్నల్ కన్ను షర్మిళపైన పడింది. ఎలాగైనా ఆమెతో తన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. తాజాగా రాత్రి 9 గంటలకు షర్మిళ ఇంట్లోకి ప్రవేశించాడు. కిటికీ ద్వారా అతడు ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా షర్మిళ దగ్గరకు వెళ్లి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కర్నల్ ఆమె నోరు, గొంతు గట్టిగా నొక్కిపట్టాడు. ఊపిరి ఆడకపోవటంతో ఆమె స్పృహకోల్పోయింది. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. షర్మిళ చనిపోయిందని భావించిన కర్నల్ ఆధారాలను నాశనం చేయాలని అనుకున్నాడు. షర్మిళ బట్టలు, ఇతర వస్తువుల్ని బెడ్‌పై పడేసి నిప్పుపెట్టాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత షర్మిళ చనిపోయింది.
ఇంట్లో నుంచి పొగలు రావడంతో..
ఇంట్లోంచి పొగలు రావటంతో పక్కింటి వాళ్లు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పారు. బెడ్ రూములో షర్మిళ అప్పటికే చనిపోయి కనిపించింది. అగ్నిమాసక సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు షర్మిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పొగ కారణంగా ఆమె ఊపిరి ఆడక చనిపోయి ఉంటుందని పోలీసులు మొదట భావించారు. సైంటిఫిక్ పద్దతులు, టెక్నికల్ ఆధారాలతో కర్నల్ ఈ హత్యకు పాల్పడినట్లు కనుగొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.





