Nepal Couple Arrested: బెంగళూరులో భారీ చోరీ జరిగింది. మారతహళ్లి కెంపాపుర రోడ్డులోని యమలూరులో రియల్టర్, బిల్డర్ శివకుమార్ ఇంట్లో రూ.18కో ట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, వెండి సామగ్రి, డబ్బును ఎత్తుకుపోయారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో పని మనుషులైన నేపాల్ దంపతులు, మరో ముగ్గురు కలిసి ఈ చోరీ చేసినట్టు గుర్తించారు. ఆదివారం ఈ ఘటన జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
శివకుమార్ కుటుంబీకులు యమలూరులోని ఏఎస్కే లేక్ గార్డెన్‌లో నివసిస్తున్నారు. వీరి ఇంట్లో సిద్దరాజు, అంబిక వంట మనుషులు. నేపాల్‌కు చెందిన దినేశ్ (32), కమల (25) అనే దంపతులు వికాస్, మాయ విష్ణు అనే ఇద్దరి ద్వారా 20 రోజుల క్రితం పనికి చేరారు. శివకుమార్ ఆదివారం ఉదయం ఊరికి వెళ్లారు. ఆయన కుమారుడు, భార్య, తల్లి బంధువుల ఇంట పూజా కార్యక్రమానికి వెళ్లారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దినేశ్, కమల మరో ముగ్గురిని రప్పించుకున్నారు. మొదటి అంతస్తులోని అల్మరాను ధ్వంసం చేసి అందులోని 11.5కేజీల బంగారం, వజ్రాభరణాలు, 5కేజీల వెండి, రూ.11.50 లక్షల నగదును దోచుకున్నారు. వంట మనిషి అంబిక యజమానులకు ఫోన్ చేసి.. దినేశ్, కమల దంపతులు లాకర్లలోని ఆభరణాలు, నగదుతో పరారైనట్లు చెప్పారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.





