* కోల్ కత్తా నగరంలో 11 స్థానాలపైనే గురి
* ఒపీనియన్ పోల్స్ లో బిజెపి ముందంజ..
* అనూహ్యంగా పుంజుకున్న బిజెపి!
క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో గట్టిగానే ఫైట్ నెలకొంది. అధికార తృణమూల్ వర్సెస్ బిజెపి అన్నట్టు పరిస్థితి మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరింది. పట్టు నిలుపుకునేందుకు అధికార టీఎంసీ.. పట్టు పెంచుకునేందుకు పక్కా వ్యూహంతో బిజెపి వేస్తున్న అడుగులు ఉత్కంఠ భరితంగా మారాయి. ప్రస్తుతానికైతే అధికార పార్టీకి సానుకూలత ఉంది. కానీ బిజెపి అనుసరిస్తున్న సరికొత్త అర్బన్ వ్యూహాల తో పోరు ఉత్కంఠ భరితంగా మారుతోంది. ముఖ్యంగా కోల్ కత్తా నగరంలో పొలిటికల్ పోరు పతాక స్థాయికి చేరింది.పశ్చిమ బెంగాల్ రాజకీయ, సాంస్కృతిక సిగలో ప్రధాన కేంద్రంగా నిలిచింది కోల్కత్తా. నగరంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. వీటి పైనే ప్రధానంగా దృష్టిపెట్టాయి అధికార టీఎంసీ, విపక్ష బిజెపి. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, బిజెపి కీలక నేత సువెందు అధికారికి మధ్యనేరుగా కురుక్షేత్రం నెలకొంది. ఇక్కడ ఫైట్ నువ్వా నేనా అన్నట్టు ఉంది.
అధికార పార్టీకి సవాల్..
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే రాజధాని కోల్కత్తా నగరంలో అధికార పార్టీకి గట్టిగానే సవాల్ ఉండబోతోంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టం అవుతుంది. పాలనాపరమైన లోపాలకు తోడు పట్టణ ఓటర్లలో చైతన్యం ఎక్కువ. అందుకే రగులుతున్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి భావిస్తోంది. అయితే ఈసారి కోల్కత్తా నగరంలో ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో విజయం దక్కి అవకాశాలే లేవు. టీఎంసీ కి క్షేత్రస్థాయిలో బలమైన సంస్థగత నిర్మాణం ఉంది. అయితే అదే సమయంలో భారతీయ జనతా పార్టీ గణనీయంగా పుంజుకుంది. బిజెపి పుంజుకున్నప్పటికీ టీఎంసీ బలం తగ్గే పరిస్థితి లేదన్నది విశ్లేషకుల మాట. ఆ పార్టీకి పట్టిష్టమైన నెట్వర్క్ ఉంది. పట్టణ ప్రాంతాల్లో నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దక్షిణ కోల్కత్తాలో మమతా బెనర్జీకి వ్యక్తిగత ఆదరణతో పాటు చరిష్మ ఉంది. ప్రధానంగా భవానీపూర్, బల్లిగంజ్, ఉత్తర కోల్కత్తాలోని పలు ప్రాంతాల్లో టిఎంసి అత్యంత బలంగా కనిపిస్తోంది.
బిజెపి స్పెషల్ ఫోకస్..
గత అనుభవాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కోల్కత్తా నగరంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలపైనే ఆ పార్టీ ఫోకస్ చేస్తూ వచ్చింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కోల్కత్తా నగరం పై కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. నగరంలోని మౌలిక సదుపాయాల కొరత, ఉద్యోగాల సృష్టి, పౌర సమస్యలను ఎత్తిచూపుతూ నిర్దిష్ట నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుంది. అందుకు తగ్గట్టుగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కోల్కత్తా నగరంలోని కీలక నియోజకవర్గం దక్కించుకోవడం ద్వారా అధికారం చేపట్టాలన్నది బిజెపి ఆలోచన. ప్రస్తుతం ఒపీనియన్ పోల్స్, గత ఎన్నికల చరిత్ర చూస్తుంటే మాత్రం అధికార టీఎంసీకి అనుకూలంగా కనిపిస్తోంది. కానీ బిజెపి కూడా అనూహ్యంగా బలపడుతున్నట్టు భావిస్తోంది. మరి ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.
