
నల్లగొండ ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):-
రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు.. తక్కువ ధరకు ఆశపడి అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. వ్యవసాయ సాగులో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో, రాష్ట్ర ప్రభుత్వం విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసి రాయితీలపై రైతులకు విత్తనాలను అందజేస్తున్నట్లు చెప్పారు.. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద, తెలంగాణ విత్తన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన కేంద్రాన్ని ప్రారంభించి, 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్టె ఎరువుల విత్తనాల పంపిణీని ప్రారంభించారు.. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు కల్తీ విత్తనాలు కొని మోసపోకుండా, తెలంగాణ విత్తన సంస్థ ద్వారా పంపిణీ చేసే విత్తనాలు మాత్రమే కొనాలని చెప్పారు.
వివిధ రకాల విత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రైతుల బయోమెట్రిక్ హాజరు తీసుకుని విత్తనాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, రానున్న వ్యవసాయ సీజన్లో సన్న బియ్యం విత్తనాలు ఎక్కువగా అవసరం అవుతాయని, ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని సన్నబియ్యం విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ఆశపడి నిబంధనలు లేని, నాణ్యత ప్రమాణాలు లేని విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. తెలంగాణ విత్తన సంస్థ జారీ చేసిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని, ప్రత్యేకించి పత్తికి సంబంధించి అనుమతులు లేని లూజ్ విత్తనాలు కొనుగోలు చేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై పత్తి విత్తనాల పాకెట్లు 901 రూపాయలకు అమ్మడం జరుగుతున్నదని, ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తి విత్తనాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే 8977751452 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, పాకెట్ పై తయారు చేసిన తేదీ, ఎక్స్ఫైరీ తేదీ అన్నింటిని జాగ్రత్తగా గమనించాలని, రసీదు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్టె ఎరువుల విత్తనాలను మంగళవారం నుండి అమ్మడం ప్రారంభించడం జరిగిందని, మండల కేంద్రాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు సంబంధిత వ్యవసాయ అధికారి ద్వారా ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలని ఆమె చెప్పారు.. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.