
క్రైమ్ మిర్రర్, షాద్ నగర్ (రంగారెడ్డి జిల్లా): బీసీ బంద్ నేపథ్యంలో షాద్ నగర్ నియోజకవర్గం, డివిజన్ పరిధిలో బంద్ పూర్తిగా ప్రశాంతంగా కొనసాగింది. ప్రజల సహకారం, పోలీసుల అప్రమత్తతతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) ఎస్. లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఉదయం నుంచే పోలీసు విభాగం శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించింది. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి, సిబ్బందిని ఎప్పటికప్పుడు పరిస్థితులపై వాకబు చేశారు. ఎసిపి స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ విజయ్‌కుమార్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎసిపి మాట్లాడుతూ ప్రజల సహకారంతో బంద్ ప్రశాంతంగా సాగింది. రాజకీయ పార్టీలు, సంఘాలు, సామాన్యులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించారు. ప్రజల భద్రతకే పోలీసు శాఖ ప్రాధాన్యం ఇస్తుంది, అని పేర్కొన్నారు. అలాగే ఆయన ప్రజలకు సూచిస్తూ ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి, అని విజ్ఞప్తి చేశారు.
ప్రజల సహకారమే శాంతిభద్రతలకు ఆధారం అని ఎసిపి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్‌కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
— క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, షాద్ నగర్