
Sheikh Hasina: భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ విజ్ఞప్తిని మనస్సాక్షితో ఆలోచించి పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆదేశ తాత్కాలిక అధినేత యూనస్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.
చాలా కాలం పొడిగించడం సరికాదు!
హసీనా అప్పగింత వ్యవహారాన్ని భారత్ చాలా కాలం పొడిగించడం సరికాదన్నారు యూనస్. “హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా, భారత్ స్పందించడం లేదు. ఈ విషయాన్ని ఎక్కువ కాలం పొడిగించడం సరికాదు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత్ రక్షణ కల్పించకూడదు. దేశ పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేయించిన వ్యక్తులను ఏ రాజకీయ వారసత్వం కాపాడలేదు. చట్టబద్ద పాలన, ప్రజాస్వామ్య సమగ్రత విలువను భారత్ గౌరవించాలని కోరుతున్నాం. నాయకులు ఎంత శక్తిమంతమైనా, చట్టానికి అతీతం కాదు. బాధితులను న్యాయం జరగాల్సిందే” అని ఆ లేఖలో యూనస్ కోరారు.
గత ఆగష్టు 5 నుంచి భారత్ లో ఆశ్రయం
బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన షేక్ హసీనా, గత ఏడాది ఆగష్టు 5 బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చింది. అప్పటి నుంచి ఆమె భారత్ లోనే తలదాచుకుంటున్నారు. హసీనా పదవి నుంచి తప్పుకున్న తర్వాత నిరసనకారులు హిందూ మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏకంగా 1400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా వేసింది. ఆ తర్వాత యూనస్ తాత్కాలిక దేశాధినేతగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఆ తర్వాత హసీనాపై హత్య సహా పలు కేసులు నమోదయ్యాయి. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఆమెకు 6 నెలల జైలు శిక్ష వేసింది. ఈ నేపథ్యంలో ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.