తెలంగాణలో కాంగ్రెస్ నేతలు బరి తెగించి దాడులకు తెగబడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పట్టపగలు అందరూ చూస్తుండగా ఇనుప రాడ్లు, రాళ్లు, గుడ్లు, కర్రలతో బీజేపీ కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పోషించడం సిగ్గు చేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై బీజేపీ ఎప్పటి కప్పుడు నిలదీస్తుంటే ఓర్వలేక ఈ దాడులు చేయించినట్లు స్పష్టమవుతోందని బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడిలో గాయపడిన దళిత కార్యకర్త నందురాజ్ కుటుంబాన్ని పరామర్శించారు. పాతబస్తీలో బహదూర్ పురాలోని నందు ఇంటికి వెళ్లి బండి సంజయ్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. కాంగ్రెస్ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలెవరూ బయట తిరగలేరని హెచ్చరించారు.